Thursday, November 17, 2011

రోమ్ లో రోమన్ లా...

ఈ రోజు ఆఫీసు నుండి వస్తూ డిన్నర్ కోసం అని మా ఇంటి దగ్గరలోని ఉడిపి పార్క్ కి వెళ్లాను. నా పార్సెల్ కోసం వెయిట్ చేస్తూండగా "15 నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నాను, నా రోటి కర్రీ ఎంత సేపు?" అని కోపంగా ఒక కన్నడ రాని సాఫ్ట్ వేర్ ఇంజనీర్  హిందీలో అరిచాడు. పాపం ఎప్పుడూ బిజీగా యాంత్రికంగా పనిచేసుకునే ఆ హోటల్ కుర్రాళ్ళు ఒక్కసారి పని ఆపుకుని మరీ ఎవరా అరిచేది అని చూసారు. "రెడీ అవుతూ ఉంది"  అని ఒకతను కన్నడలో చెప్పాడు. వీడితో గొడవ ఎందుకు అనుకున్నాడేమో  అప్పుడే రెడీ అయిన రోటి-కర్రీ అతనికి ఇచ్చాడు. తన ప్లేట్ తీసుకుంటుండగా మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది ఆ హిందీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి! ఏదో హిందీ లో చెప్పాడు... హోటల్ కుర్రాడు ఏదో కొంచెం అర్ధం అయినట్లు కన్నడలో సమాధానం ఇచ్చాడు. మన హిందీ మాష్టారుకి అర్ధం కాలేదు. "మీరేదో భాషలో చెప్తే నాకెలా అర్ధం అవుతుంది?" అని అన్నాడు చిరాగ్గా! ఇది ఖచ్చితంగా కండకావరం. బెంగుళూరు లో ఏ భాష మాట్లాడతారో వాడికి తెలియదా? ఈ సారి వేరే అతను కొంచెం హిందీ-కన్నడ మిక్స్ చేసి చెప్పాడు. అది కన్నడిగుల మంచితనం. ఇట్లాంటి సీన్ బొంబాయి లో కాని, ఢిల్లీలో కాని జరుగుతుందా?

ఇక్కడ నాకు అర్ధం కాని విషయం ఏంటంటే, బాగా చదువుకున్నతను స్థానిక భాషని నేర్చుకోలేనప్పుడు, ఒక హోటల్లో ఇడ్లీ దోస సెర్వ్ చేసే అతనికి హిందీ ఎలా వస్తుందని అనుకుంటాడు. చదువు వంటపట్టకే కదా హోటల్లో చేరాడు. కాని నేను ఇలాంటి ప్రవర్తన చాలామంది నార్త్ ఇండియన్స్ దగ్గర చూసాను, ఎక్కువగా లోకల్ బస్సులలో!  కన్నడ నేర్చుకునే ప్రయత్నం చెయ్యరు, వేరే భాషకి కనీస గౌరవం ఇవ్వరు. ప్రతి భారతీయుడు హిందీ మాట్లాడి తీరాలి అని ఒక రూల్ ఉన్నట్లు మాట్లాడుతారు. మళ్ళీ హిందీ జాతీయ భాష అని ఒక వాదన. హిందీ జాతీయ భాష కాదు మొర్రో, ఇండియాలో ఎక్కువమంది మాట్లాడే అధికారిక భాషల్లో ఒకటి మాత్రమే అని నేను ఎన్నిసార్లు వాదించి భారత రాజ్యాంగం పిడిఎఫ్ ఫైల్ చూపించాల్సి వచ్చిందో! ఇతనో సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అంటే ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ లేకపోతే కనీసం ఏదో ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉద్యోగం చేస్తూ ఉండి ఉండొచ్చు. బ్రతకటానికి ఇన్ని నేర్చుకున్న వ్యక్తి స్థానిక భాషనీ ఎందుకు నేర్చుకోడు. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవటంలో ఉన్న ఉపయోగం, సౌకర్యం వీళ్ళకి తెలియదు ( అంటే నాకు కన్నడ పూర్తిగా వచ్చని కాదు, బయటికి వెళ్తే అవరమైనంత వరకు కన్నడలో మాట్లాడగలను).  "be a roman in rome" అన్న సామెత అందరికీ తెలుసు. రొమ్ లో ఇటాలియన్ మాట్లాడతారేమో కాని సౌత్ ఇండియా వచ్చినప్పుడు మాత్రం కొంతమంది నార్త్ ఇండియన్స్ హిందీనే  మాట్లాడతారు. కాని వీళ్ళ కండకావరాన్ని తమిళవాళ్ళు దించుతారు. చెన్నైలో తమిళం నేర్చుకోకుండా బతకటం అసాధ్యం. పుట్టినప్పటి నుండి మూడున్నరేళ్ళు బాపట్లలో పెరిగిన మా అక్క కూతురు pre-KG అయ్యి LKG వచ్చేసరికి తమిళంలో ఆపకుండా మాట్లాడేస్తుంది నాలుగేళ్ళ వయసులో.   ఈ మధ్య చెన్నై రైల్వే స్టేషన్ శరవణ భవన్ లో ఒక హిందీ బ్యాచ్ తినటానికి వచ్చింది. వాళ్ళలో కొంతమంది ఒక మోస్తరు  తమిళంలో సర్వర్లతో మేనేజ్ చేస్తున్నారు. ఇలా బెంగుళూరు లో కాని హైదరాబాద్లో  కాని జరుతుందా అంటే డౌటే!

No comments:

Post a Comment

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు, చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అంటారు,  కానీ చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు ఉన్నాయి. ఇది స్వయంకృతమా లేక మితిమీరిన రాజకీయ ఆత్మవిశ్వాసమా? ర...